Thursday, February 29, 2024

TS DSC Notification 2024: తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల… 11వేల పోస్టులతో ఉద్యోగాల భర్తీ

TS DSC Notification 2024: తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ అధికారులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ 2024 నోటిపికేషన్ విడుదల చేశారు.



గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్త నోటిఫికేషన్‌‌ను గురువారం సిఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

 

తెలంగాణలో Telangana 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్‌ మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ వెలువడింది. దానిని రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.

గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబరు 6వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అప్పట్లో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ముందు డిఎస్సీ ప్రకటించడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఏక కాలంలో డిఎస్సీ, ఎన్నికల విధుల నిర్వహణ కష్టమని తేలడంతో డిఎస్సీని వాయిదా వేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం Congress Govt మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. పాత వాటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేస్తారని మొదట ప్రచారం జరిగినా.. పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఒకే నోటిఫికేషన్‌లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు.

 

11,062 పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు2629, సెకండరీ గ్రేడ్ టీచర్‌ పోస్టులు 6508, లాంగ్వేజ్‌ పండిట్లు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. పాత పోస్టులతో పాటు కొత్తగా మరో 4597 పోస్టుల్ని కలిపి ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో మరో 796 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అమోదం తెలిపింది.అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాలల్లో మరో 220 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా భర్తీ చేస్తారు.

పాత నోటిఫికేషన్‌ ఉద్యోగాలతో మొత్తం పోస్టులకు కలిపి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. https://schooledu.telangana.gov.in/ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.